తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర EAGLE టీం డైరెక్టర్ శాందీప్ శ్యాండిల్య గారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట కార్యక్రమంలో బాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈసందర్భంగా గురువారం రోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించి,డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలు,వాటి దుష్పరిణామాలు,అలాగే పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నటేష్ మాట్లాడుతూ..దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన నేటితరం విద్యార్థులని,వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,విద్యార్థులు తమ శక్తిని క్రీడలు, విద్య మరియు ఇతర నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు మళ్లించుకోవాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన EAGLE టీం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
డ్రగ్స్ వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని,యువత భవిష్యత్తును కాపాడటమే పోలీస్ శాఖ మరియు EAGLE టీమ్‌ల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు