prajadivaas.in
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 9:24 am Digital Edition : PRAJA DIVAAS MEDIA

*ప్రాణాలతో ఆటలు… భద్రత లేకుండా హాస్పిటళ్ల దందా*..!

🔴 పెట్రోల్ బంక్ పక్కనే ఆసుపత్రులు – విపత్తుకు వేచి చూస్తున్నారా..?

 

🔴 నిబంధనలు గాలికి… ప్రజల ప్రాణాలు ప్రమాదంలో..!

 

🔴 పార్కింగ్ లేదు… ఫైర్ సేఫ్టీ లేదు – ఎలా ఇచ్చారు అనుమతులు..?

 

🔴 అధికారుల నిర్లక్ష్యం… ప్రమాదానికి ఆహ్వానం..!

 

ప్రజాదివాస్ / రాజన్న సిరిసిల్ల:

 

ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలను పక్కన పెట్టి ప్రాణాలతో ఆటలాడుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంక్ పక్కనే కొనసాగుతున్న కొన్ని హాస్పిటళ్లు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం పెట్రోల్ బంక్‌కు కనీసం 50 మీటర్ల దూరంలో ఆసుపత్రి ఉండాలి. అయితే ఇక్కడ ఆ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించబడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆసుపత్రిలో ఉన్న రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని అంటున్నారు.అదనంగా, ఆసుపత్రుల్లో సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రాకపోకలకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఎలా ఎన్‌ఓసీ ఇచ్చారో అగ్నిమాపక శాఖకే తెలియాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.జిల్లా వైద్యాధికారులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అనుమతుల గడువు ముగిసినా ఆసుపత్రులు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదాల నేపథ్యంలో, ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయోనని స్థానికులు భయంతో జీవిస్తున్నారు.

 

*అగ్నిప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది..? ప్రజల ఆగ్రహం*

 

ప్రమాదం సంభవిస్తే బాధ్యత ఎవరు వహిస్తారో అధికారులే స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నోటీసులు ఇచ్చామని చెప్పడం తప్ప సమస్యను పరిష్కరించడంలో ఎలాంటి చర్యలు కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

*హాస్పిటళ్ల పేరిట ప్రాణాలతో వ్యాపారం*..!

 

కొన్ని ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తూ కేవలం ఆర్థిక లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

*కలెక్టర్ వెంటనే స్పందించాలి – ప్రమాదం ముంచుకొస్తోంది* .!

 

జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విచారణ జరిపి, భద్రతా ప్రమాణాలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇతర సురక్షిత ప్రాంతాలకు మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ప్రాణ భద్రత కంటే ముఖ్యమైనది మరొకటి లేదని, అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే జరిగే విపత్తుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తురు.